ఇరువైపులా వాదనలపై సమగ్ర సమాచారం.
అశ్వాపురం ప్రతినిధి.
జూలై 20. (నవశకం). వివరాలలోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల పరిధిలోని మనుబోతులగూడెం పోడు భూములకు సంబంధించి మూడు రోజుల క్రితం అటవీశాఖ అధికారులకు, వలస గొత్తి కోయ పోడు వ్యవసాయదారులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో సోమవారం జిల్లా ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్య, అటవీ భూముల పరిరక్షణ, ఆదివాసుల జీవనాధారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అన్ని అంశాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది. అశ్వాపురం మండలంలోని, మనుబోతులగూడెంలో పోడు భూముల సమస్య నేపథ్యంలో గురువారం అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య చోటుచేసుకున్న ఘటనపై సోమవారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఇరువర్గాల వాదనలు, గ్రామస్తుల అభిప్రాయాలు, పోడు భూముల పరిస్థితులు, అటవీ భూముల పరిరక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు.
ఘటనలో గిరిజన మహిళలకు గాయాలు అయినవారి పరిస్థితి ఎలా ఉందని జిల్లా ఉన్నతాధికారులు ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు వైద్యశాలలో చేర్పించామని, వారి పరిస్థితి ప్రస్తుతం కొంచెం బాగానే ఉందని తెలియజేశారు. అనంతరం అటవీశాఖ మహిళా సిబ్బంది, ఇతర సిబ్బంది తమపై ఆదివాసీలు ఎలా దాడి చేసినది జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. ఆదివాసీలు కర్రలతో, వాటర్ బాటిళ్లతో దాడి చేసినది జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు.
జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిన, పెను సంఘటనకు దారితీసిన పరిస్థితులను అన్ని కోణాలలోనూ అధ్యయనం చేసి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కాని పరస్పరం ఇలా దాడులకు దిగటం సరికాదని, సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అధికారులు తెలియజేశారు. పరిస్థితులను అన్నింటిని సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ రాహుల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారి (డిఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎస్ డి ఎఫ్ ఓ బాబు, మణుగూరు రేంజర్ ఉపేంద్ర, అశ్వాపురం రేంజర్ సత్తార్ అలీ, తహసీల్దార్ సూర్యప్రకాష్, సిఐ ఎల్లయ్య స్థానిక అటవీశాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.